-->

సిద్ధార్థ గౌతముడు నాటి ఆధ్యాత్మిక గురువులలో ఒకరు మరియు బౌద్ధ ధర్మానికి మూల కారకులు. బౌద్ధులందరిచే మహా బుద్ధుడిగా కీర్తింపబడేవాడు. బుద్ధుని జనన మరణాల కాలం స్పష్టంగా తెలియరావడం లేదు: 20వ శతాబ్దపు చారిత్రకకారులు క్రీ.పూ 563 నుండి 483 మధ్యలో జననం అని, 410 నుండి 400 మధ్యలో మరణం ఉండవచ్చు అని భావిస్తున్నారు. గౌతముడిని శాక్యముని అని కూడా పిలుస్తారు. ఆయన జీవిత సంఘటనలు, బోధలు మరియు భిక్షువుల నడవడికలు మొదలగునవి అన్ని ఆయన మరణం తరువాత సంఘముచే తరతరాలుగా పారాయణం చేయబడ్డాయి. మొదట, నోటి మాటగా బోధింపబడినా, దాదాపు నాలుగు వందల సంవత్సరాల తరువాత త్రిపీటక అనే పేరుతో మూడు పీఠికలుగా విభజింపబడి భద్రపరిచారు.

బుద్ధుని జీవితములో, కేవలం కొన్ని వివరములు మాత్రమే నిర్ధారించగలము, మిగతా వాటి చారిత్రకతకు ఆధారాలు కష్టమే. బౌద్ధ సాహిత్యం నుండి మనకు లభించు వివరములే ఎక్కువ. క్లుప్తంగా క్రింద వివరించబడినవి. బుద్ధుడు మరియు అతని శిష్యులు, ప్రతి సంవత్సరం నాలుగు నెలలు బుద్ధుని బోధనలను చర్చించి ఆచరించేవారు. ఈ బోధనలను భద్రపరచి ప్రచారం చెయ్యడానికి బుద్ధుని నిర్యాణం తర్వాత ఒక సంఘం ఏర్పడింది. ఒక శతాబ్దం తర్వాత ఇంకో సంఘం ఏర్పడింది. ఈ రెండు సంఘాలు బుద్ధుని బోధనలను ప్రచారం చేయసాగాయి. ఈ సంఘాలు బుద్ధుని బోధనలను, వేర్వేరు భాగాలుగా విభజించి ఒక్కో భాగాన్ని ఒక్కో బౌద్ధ భిక్షువుకు అప్పగించాయి. అప్పటి నుంచి బుద్దుని బోధనలు ముఖస్థంగా ప్రచారం కాసాగాయి. చరిత్ర ప్రకారం బుద్ధుని బోధనలను, రెండవ సంఘం ఏర్పడినప్పుడు గానీ, లేదా తర్వాత కొద్ది కాలానికి గానీ ప్రస్తుత రూపాన్ని సంతరించుకున్నాయి. కానీ, ఈ బోధనలు బుద్ధుని నిర్యాణానంతరం, మూడు, నాలుగు శతాబ్దాల వరకు ఎక్కడా గ్రంధస్థం చెయ్యబడలేదు. ఈ సమయంలో బౌద్ధ బిక్షువులు, గౌతమ బుద్ధుని జీవితాన్ని మరింత గొప్పగా మలచడానికి, అతని చరిత్రను, బోధనలను, మార్చడం గానీ, లేదా కొత్త విషయాలను జోడించడం గానీ చేసిఉండవచ్చునని కొందరి అభిప్రాయం.
ప్రాచీన భారతీయులు కాలక్రమము కన్నా తత్వశాస్త్రమునకే ప్రాముఖ్యతనిచ్చేవారు. అందువల్ల బౌద్ధ మత గ్రంధాలలో కూడా, శాక్యముని జీవిత చరిత్ర కన్నా ఆయన బోధనలకే ప్రాముఖ్యం ఉంటుంది. ఈ గ్రంధాలలో ప్రాచీన భారతీయ నాగరికత మరియు జీవన విధానం వివరించబడింది.

జ్ఞానోదయం:-
తర్వాత సిద్ధార్దుడు ధ్యానం, అనాపనసతి(ఉశ్చ్వాస, నిశ్వాసలు) ద్వారా మధ్యయ మార్గాన్ని కనిపెట్టాడు (ఐహిక సుఖాలను, కోరికలను త్యజించడం). ఈ సమయంలో సుజాత అనే పల్లె పడుచు తెచ్చే కొద్ది అన్నాన్ని, పాలను ఆహారంగా తీసుకునేవాడు. తర్వాత సిద్ధార్దుడు, బుద్ధ గయలో ఒక బోధి వృక్షం నీడలో పరమ సత్యం తెలుసుకొనుటకు భగవత్ ధ్యానం చేశాడు. కాని కౌండిన్యుడు మరియు అతని ఇతర శిష్యులు, సిద్ధార్దుడు జ్ఞాన సముపార్జన సాధనను విరమించినట్లుగా, క్రమశిక్షణా రహితుడుగా భావించారు. చివరకు, తన 35వ ఏట, 49 రోజుల ధ్యానం తర్వాత, సిద్ధార్దునకు జ్ఞానోదయమయ్యింది. కొందరి అభిప్రాయం ప్రకారం, సిద్ధార్దునకు బాధ్రపద మాసంలో జ్ఞానోదయమయ్యిందని, ఇంకొందరి అభిప్రాయం ప్రకారం, సిద్ధార్దునకు ఫాల్గుణ మాసంలో జ్ఞానోదయమయ్యిందని చెప్తారు. అప్పటి నుండి, గౌతమ సిద్ధార్దుడు, గౌతమ బుద్ధునిగా మారాడు. బౌద్ధ మతంలో ఇతనిని శాక్యముని బుద్దుదని భావిస్తారు.

జ్ఞానోదయమయ్యాక, గౌతమ బుద్ధుడు, మానవుని అజ్ఞానానికి, కష్టాలకు కారణాలను, వాటి నుండి విముక్తి పొందడానికి మార్గాలను తెలుసుకోగలిగాడు. వీటిని 4 పరమ సత్యాలుగా విభజించాడు. దీనినే బౌద్ధ మతంలో నిర్వాణమందురు. అప్పుడు గౌతమ బుద్ధుడు, ప్రతి బుద్ధునకు ఉండవలసిన 9 లక్షణాలను ప్రతిపాదించాడు. ఆయాచన సూక్తిలో ఉన్నా కొన్ని గాధల ప్రకారం, జ్ఞానోదయమయ్యాక, గౌతమ బుద్ధుడు, తను తెలుసుకున్న ధర్మాన్ని సామాన్య ప్రజలకు బోధించాలా వద్దా అనే సందిగ్ధంలో పడ్డాడు. దీనికి కారణం, దురాశ, అసూయ, ద్వేషాలతో నిండిన మానవుడు, తను తెలుసుకున్న ధర్మాన్ని అర్ధం చేసుకోలేదని బుద్ధుడు భావించాడు. కానీ భ్రహ్మ సహంపతి విన్నపంతో, గౌతమ బుద్ధుడు, బోధకునిగా మారడానికి నిర్ణయించుకున్నాడు.

బాజి జ్ఞానోదయమయ్యాక, గౌతమ బుద్ధుడు, తపుస్సా, భల్లక అనే ఇద్దరు వర్తకులను తన ప్రధమ శిష్యులుగా చేసుకున్నాడు. వారికి గౌతమ బుద్ధుడు తన తల నుండి కొన్ని వెంట్రుకలను ఇచ్చాడనీ, వాటిని ఇప్పటికీ రంగూన్ లో ఉన్న ష్యూ డాగన్ ఆలయంలో భద్రపరిచారనీ ప్రజలు నమ్ముతున్నారు. తర్వాత బుద్ధుడు తన పూర్వాచార్యులైన అలరకలమ మరియు ఉద్దకరామపుత్తలకు తను తెలుసుకున్న పరమ సత్యం గురించి చెప్పాలని భావించాడు. కాని వారు అప్పటికే మరణించారు.

అప్పుడు బుద్ధుడు ఉత్తర భారతదేశంలో ఉన్న వారణాశిలో ఒక లేళ్ళ ఉద్యానవనంలో, కౌండిన్యిని దగ్గర తనతో పాటూ శిష్యరికం చేసిన మిగతా ఐదుగురు సన్యాసులకు, తను తెలుసుకున్న పరమ సత్యంపై మొదటి ఉపన్యాసం ఇచ్చాడు. వీరంతా బుద్ధునితో కలిసి మొదటి బౌద్ధ భిక్షువుల సంఘాన్ని ఏర్పరిచారు. ఈ విధంగా బుద్ధం, ధర్మం, సంఘం అనే మూడు సూత్రాలతో కూడిన మొదటి బౌద్ధ మత సంఘం ఏర్పడింది. తర్వాత యాసుడు మరియు అతని 54 మంది మిత్రుల చేరికతో బౌద్ధ మత సంఘంలోని వ్యక్తుల సంఖ్య 60 ని దాటింది. తర్వాత ముగ్గురు కశ్యప సోదరులు మరియు వారి 200, 300, 500 మంది శిష్యుల చేరికతో బౌద్ధ మత సంఘ పరిమాణం 1000 ని దాటింది. వీరంతా బుద్ధుని బోధనలను, సామాన్య ప్రజలకు బోధించడానికి ప్రపంచమంతా పర్యటించారు.    
Next
This is the most recent post.
Previous
Older Post

Post a Comment

 
Top